|
దీనము పరిశుద్ధమునైన జీవితం |
కీ.శే. యన్. దానియేలు గారు |
మత్తయి 14:22-36
ఐదు (5) వేల మందికి ఆహారము పెట్టే సూచకక్రియ చేసిన తర్వాత యేసు ఒంటరిగా ప్రార్థన చేయటానికి వెళ్ళిపోయాడు. శిష్యులను పంపించి వేశాడు. క్రీస్తు ఒంటరిగా ఉండినాడు. కపెర్నహోము చేరవలసిన విధమును గూర్చి ఆయన చింతించలేదు. అప్పుడు అక్కడ ఆయన తర్వాత సేవ చేయవలసియున్నది. శిష్యులకు ప్రార్థనావశ్యకత కనబడలేదు. దైవజనుడు చీకటి శక్తులతో యుద్ధమందు ఎదుర్కొనవలసియున్నాడు. శిష్యులు ఆ ప్రాంతము ఇంకను ప్రవేశించలేదు. సైతాను మారు మనస్సు పొంది దేవుని చిత్తము వెలుపట ఉన్న వారి విషయము ఎక్కువగా చింతించడు. రోమా 12:2 ''మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి'', ఉత్తమమును అనుకూలము సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమును తెలిసికొనుటకు ఒకడు ఎల్లప్పుడు తన మనస్సు మారి రూపాంతరము పొందవలెను. దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఎల్లప్పుడు ఒకని ఆలోచనను నూతన పరచును. నీవు పరిపూర్ణమునైయున్న ఆయన చిత్తము నందు ఉన్నట్లయితే సైతాను ఒక ప్రత్యేకమైన శత్రువుగా నిన్ను భావిస్తాడు. పరిశుద్ధుడైన పౌలు బితునియకు బయలుదేరుచుండెను. కాని ఆ రాత్రి ప్రభువు అతనిని ఐరోపాకు వెళ్ళమని నడిపించారు. బితునియాకు వెళ్ళడం మంచిదే. కాని అది పరిపూర్ణమైన దేవుని చిత్తము కాదు.
నీవు సైతానుతో పోరాడుటకు ప్రవేశించినావో లేదో అదే ప్రశ్న. నీవు ప్రవేశించి యుంటే నీవు ప్రార్థనకు ఎప్పుడు వెళ్ళిపోవాలో తెలుసుకుందువు. నీ ఆత్మీయ జీవితంను సరియైన మెట్టులో నీవు కాపాడుకుంటే తప్ప జీవజలము నీలో నుండి క్రింది మెట్టులో ఉన్నవారికి ప్రవహించదు. క్రీస్తు శిష్యులు ఇంకనూ ఆత్మీయ మెళకువలో లేరు. కనుక వారిని తన సొంత మార్గంలో వెళ్ళనిచ్చారు. వారు తమ ఆత్మీయ మెట్టును గ్రహించగలిగిన స్థితికి వచ్చే వరకు అలాగు కానిచ్చారు. క్రీస్తు తన మెట్టును ఎరిగియుండినారు. కాని పేతురు తన మెట్టును ఎరుగడు. గెత్సెమనే వనంలో కూడా మహా భయంకరమైన పోరాటం జరుగుతూ ఉండినప్పుడు అతడు నిద్రించుచుండినాడు.
రాత్రి మొదటి భాగములో క్రీస్తు ప్రార్థనలో ఉండినాడు. ఆ సమయంలో శిష్యులు పడవను నడుపుటలో గట్టిగా ప్రయాస పడుచుండినారు. కాని సైతాను వారిని ఎదిరించుచుండినాడు. వారు మార్గంలో ముందుకు సాగలేకపోయారు. క్రీస్తు పడవలోనికి ప్రవేశించినప్పుడు ఎదురాడు శక్తులు పారిపోయినాయి. వెంటనే పడవ దాని గమ్యస్థానం చేరింది. క్రీస్తు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. మనం ప్రార్థించేటప్పుడు మట్టుకే మనం నూతన విషయాలను కనుక్కోవడం గాని, చేయడంగాని సంభవిస్తుంది. క్రీస్తు పడవలోనికి వచ్చినపుడు గాలి ఆగిపోయింది. దేవుని చిత్తములో ఉండుట సమయం సరిగా గడుపుట. ఈ ప్రజలు క్రీస్తు తన ప్రార్థన ముగించుకొని వారి యొద్దకు చేరే వరకు పోరాడుతూ ఉండినారు. ప్రార్థన యొక్క విలువను డబ్బుతోగాని, సమయంతోగాని లెక్కించవద్దు. కొన్నిసార్లు దేవుడు మీయందు పనిచేయుటకు సమయం తీసుకోకుండా ఉంటే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొనలేరు. చివరగా పేతురు వలె మీరు ముగినిపోవడానికి ప్రారంభిస్తారు. లోతులేని నీళ్ళలో మీరు పట్టుబడకుండా చూసుకోండి. క్రీస్తు ఎన్నడు అలాగు పట్టుబడలేదు. ఆయన గెన్నేసరెతుకు చేరుకోగానే వ్యాధిగ్రస్తుల నందరినీ ఆయన దగ్గరకు తెచ్చారు. ఆయన వారి అవసరతలన్నిటిని తీర్చారు. క్రీస్తు 40 దినములు ఉపవాసముండి ప్రార్థించగా సైతాను ఆయనను 40 దినాలు శోధిస్తూ ఉండినాడు. ఎందుకనగా ఆయన 40 దినములు ప్రార్థన జయకరంగా ముగించినట్లయితే సైతాను యొక్క రాజ్యము కూలద్రోయబడును.
మనం మన ప్రభువు వలె ఉండవలెను. ఆత్మీయంగా మెళకువగా ఉండాలి. ఎప్పుడైనను సరే మనం ఎదుర్కొనే అవసరతకు సిద్ధంగా ఉండాలి. వ్యాధిగ్రస్తులు మన దగ్గరకు వస్తే మనం దానికి సిద్ధంగా ఉన్నామా? ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుట కృప కొరకు దేవున్ని నేను అడుగుచున్నాను. మనుష్యులు మన దగ్గరకు వచ్చినపుడు మనం వారికొరకు ప్రార్థిస్తే వారు వెంటనే తమ పాపముల గూర్చి ఒప్పించబడాలి. నీకు ఉండే బలమును గూర్చి నీవు ఎరిగియుండాలి. ఎంత బలం అవసరమో ఆత్మీయంగా నీవు దానిని సరిగా అంచనా వేయుటకు శక్తిమంతుడవై యుండాలి. మనచుట్టూ ఉండే ప్రజల యొక్క అవసరత చాలా గొప్పది. మీలో ప్రతి ఒక్కరికి ఈ పనిలో వాటా ఉంది. వ్యాధిగ్రస్థులు ఆయనపై వేసుకొన్న వస్త్రం యొక్క అంచును ముట్టుకుంటే చాలును అనుకునే వారు. ఆయనను ముట్టుకునే వారు అందరూ స్వస్థత పొందారు. మత్తయి 14:36 ఇలాంటి సేవకు ఒక దీనమైన, పరిశుద్ధమైన జీవితం అవసరం.
|
|