లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని ఏర్పాటును నెరవేర్చుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

కీర్తనలు 37:16
''నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తి హీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము''.

ఈ దినములలో మనుష్యులెప్పుడూ ధనము వెంబడిస్తారు. వారి విశ్వాసము యెల్లప్పుడు ధనము నందే యున్నది. కానీ ఒక నీతిమంతుడు కలిగియున్న కొంచెము అతనికి సంరక్షణను సంతోషమును తెచ్చియిచ్చునని యోబు చెపుతున్నాడు. ప్రభువును ఎరిగిన వారు దైవస్వభావము నందు ధనికులై యుండవలెనని కోరతారు. ఇది ఒక గొప్ప ఆశీర్వాదము. ఈ వ్యక్తి ఎక్కడకు వెళ్ళినా సంతోషమును ఆర్యోగమును వెదజల్లుతాడు. అతడు స్థిరుడు కీర్తనలు 37: 3, 4 ''యెహోవా యందు నమ్మకముంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యము ననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును''.

ప్రభువు యొక్క మార్గమందు నీవు ఆనందించినట్లయితే నీవు ప్రభువు నందు నిన్ను నీవు సంతోషపరచుకొనవచ్చు. కీర్తనలు 112:1, 2 ''యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అతని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యదార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు''. ప్రభువు యొక్క ఆజ్ఞలలో సంతోషించడం - మనస్తాపంతో ప్రభువును వెంబడించటం కాదు. అవి నిన్ను ధనవంతునిగా చేయకపోవచ్చు. - నిన్ను గొప్పవానిగా, ప్రాముఖ్యత గల వానిగా చేయకపోవచ్చు. కాని క్రీస్తులో బయలుపరచబడిన దేవుని స్వభావమును నీకు సంపాదించును. అదియొక గొప్ప ఆశీర్వాదము. అది నీకు సమాధానము నిచ్చును. కీర్తన 34:12-14 ''బ్రతుకగోరు వాడెవడైననునున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైననున్నాడా? చెడ్డమాటలు పలుకకుండా నీ నాలుకకు కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులకు కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదికి దాని వెంటాడుము''.

సమాధానము వెదికి దాని వెంటాడుము. మీరు సమాధానకర్తకు బిడ్డలైయున్నారు. నీవు గుడిసెలో జీవించవచ్చు. అతి సాధారణమైన భోజనం భుజించవచ్చు. కాని నీ యొద్ద దేవుని సమాధానమును క్రీస్తు స్వభావమును ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. అడవిలో అడవి జంతువుల మధ్య నీవు సమాధానమును అనుభవించలేవు. మనుష్యుని హృదయములో సమాధానము లేదు, కాని ఆ హృదయములో పోరాటమున్నది. యాకోబు 4:1 ''మీలో యుద్ధములును, పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా?'' మనుష్యుడు తొందర చేయబడుచున్న వ్యక్తి తన్ను తాను ఎరుగడు. తనకు అవసరమైనది ఎరుగడు, ధనార్జన చేయవలెనని అనుకుంటాడు. అది అతనికి సమాధానము తీసుకురాదు. క్రీస్తు యొక్క స్వభావమును వెదికితే వారు సమాధానమును కలిగి ఉంటారు. ఒక నీతిమంతుడు కలిగి ఉండే కొంచెము, దుర్మార్గుడు కలిగి ఉండే ధనార్జన కన్నా గొప్పది. నిజముగా నీతిమంతుడైనవాడు ధనార్జన మీద తన ఆశను నిలుపడు.

దేవుని ధర్మశాస్త్రమంతయు మనుష్యుని ఆరోగ్యమునకే ఇవ్వబడినది. నీవు ఇల్లు కట్టేటప్పుడు అనేక సూత్రములు వెంబడిస్తావు. ఒక గోడ కట్టవలెనన్న సరే. కొన్ని సూత్రములు వెంబడిస్తావు. ఒక దూలము నిర్మించాలంటే ఇతర సూత్రములు వెంబడిస్తారు. అదే రీతిగా నీ జీవిత నిర్మాణం కూడా. దేవుడు నీకు అనేక సూత్రములిస్తాడు. వాటిలో ఒకటి ధనము సంపాదించకూడదు. కాని దేవుని స్వభావం వెదుకు. కీర్తనలు 37: 35, 36. ''భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వర్థిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదికితిని గాని వాడు కనబడకపోయెను''.

కీర్త 37:18, 19, 25 ''నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు, భక్తి హీనులు నశించిపోవుదురు. నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనైయున్నాను. అయినను నీతిమంతుడు విడువబడుట గాని వారి సంతానము బిక్షమెత్తుట గాని నేను చూచియుండలేను''. ఓ నీతిమంతుని బిడ్డల గురించి దేవుడు చాలా లక్ష్యం ఉంచి ఉన్నాడు.

అపవిత్రమైన ధనము కొరకు చెయ్యి చాపక కష్టపడి పనిచేసి దేవుని వైపు మట్టుకే చూచువారు నింపబడతారు. అతడు పరలోకపు ధనమును వెతుకుతున్నాడు. వాటి నిమిత్తము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రయాసపడతాడు. అతని హృదయములో యుద్ధము ఉండదు. దేవుడు చిట్టచివరగా వాగ్దానం చేసేది ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రమును నీ మనస్సులో పెడతాడు. వాటిని నీ హృదయం మీద లిఖిస్తాడు. నాడీ క్రియలను మనస్సు అదుపులో పెట్టుకుంటుంది. హృదయం నీకోర్కెలను నీ చిత్తంను అదుపులో పెడుతుంది. మనుష్యులు ధనం వెంబడి పరుగెత్తుతారు. మరియు నిత్యమైన ఆస్తిని వెంబడించరు - దేవుని నీతి. ఒకడు తన మాదిరి జీవితం ఆత్మీయ జీవితం సరైన మార్గములో పెట్టనివాడు నీతిమంతుడు ఎలాగు కాగలడు.

మనుష్యులు అనేక రకాలైన సాకులు దేవున్ని ఆరాధించటానికి చెబుతూ ఉంటారు. దేవుని కొరకు తమ సమయము వ్యయపరిచి ఈ లోకంలో ఎవరైనను బాధపడ్డారా? ముందుకు సాగి నాయకుడవ్వ లేదా? మీలో కొంతమంది మిషనరీలుగా అవుతారు? మీరెక్కడ తర్ఫీదు పొందుతున్నారు? తన బైబిలు నెరిగి ప్రార్థనచేయుట నెరిగినవారు ఒక రోజున మెషనరీ తప్పక అవుతాడు.

ఇక్కడకు అక్కడకు కూటములకు పరుగెత్తకండి. మీ సమయము పరిమితము. మీరు ఒక్క స్థలములో నిబ్బరముగా ఎదగటం అవసరం. ఇక్కడకు, అక్కడకు పరుగెత్తేవారు ఏమీ సంపాదించుకోలేరు. మనము ఇతరులకన్నా మేలైన వారమని ఎంచుకోము. దేవుడు మనకొక ప్రత్యేకమైన ఉద్దేశము నియమించి ఉన్నాడు. దానిని మనము నెరవేర్చాలి.

మోషే చేసిన పని కన్నా యెహోషువా చేసిన పని వ్యత్యాసము. అదేరీతిగా యెహోషువ చేసిన పని నెహెమ్యా చేసిన పని కన్నా వ్యత్యాసము. నెహెమ్యా యెహోషువనే వెంబడించి యుంటే ఏమి జరిగియుండేది. ఆయన యుద్ధ పోరాటములు పోరాడుతూ ఉండేవాడు. ఇంకా అధికమైన భూభాగము సంపాదించుకొని యుండేవాడు. కాని అలాంటి ఉద్దేశమేమియూ లేదు. దేవుడు మనపై ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. మనము చాలా తెలుసుననుకోము. కాని తప్పకుండా ఆయన కృపను బట్టి మనకు తెలియపర్చబడిన సత్యము వెంబడించుదాము.
మూల ప్రసంగాలు