లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని నది

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెహెజ్కేలు 47:9

''వడిగా పారు నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నియూ బ్రతుకును. ఈ నీళ్ళు అచటకు వచ్చుట వలన ఆ నీళ్ళు మంచి నీళ్ళు అగును గనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడకు పారునో అక్కడ సమస్తమును బ్రతుకును'' దేవుడు ఈ ప్రవక్తను దేవుని గృహమునకు తీసుకువచ్చాడు. నీళ్ళు లోతులేనట్లుగా కనపడ్డాయి. అనగా చీల మండల లోతు నీళ్ళు, మోకాలు లోతు తరువాత ఇంకా లోతుకు వెళ్ళితే నడుము లోతు తరువాత దాటుటకు వీలుకాని నది. ఆనది క్రీస్తే. అది ప్రవహించుచున్నది. ఒక క్రైస్తవుడు చీలమండల లోతులో ప్రవేశించవచ్చును. కాని ఆ నదిలో ఎంత వరకు కొనసాగవలెను. అంటే దాని పరిశుద్ధమైన నీళ్ళలో మునిగిపోయే వరకు. ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ అంతా స్వస్థత ఉండును. ఎక్కడకు ప్రవహించునో అక్కడ జీవము ఉండును. దేవుడు మనకు ఇచ్చు పరిశుద్ధాత్ముడు ప్రారంభములో కొలవగలిగిన లోతులో ఉండును. కాని తరువాత దాన్ని కొలుచుటకు వీలుకాదు. మొట్టమొదటిసారి మన వ్యక్తిత్వ జీవితంలో నిజమైన విరిగి నలిగిన స్థితిలో దేవుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినాము. నది ప్రవహించుచూ ఉన్నది. కొంతమంది అయితే చీల మండల లోతుతో తృప్తి పడిపోయారు. కొంతమంది విశ్వాసములో కొనసాగుతారు. మోకాలు లోతు నీటి వరకు వస్తారు. మోకాలు లోతు నీరు ప్రయోజనం లేదు. దానిలో నీవు స్నానం చేయలేవు. పడవలు ఈ మోకాళ్ళ లోతు నీళ్ళలో ప్రయాణం చేయలేవు. క్రీస్తు ఎన్నడూ లోతులేని నీళ్ళవలే కొనసాగడు. లోతు లేని నదిని నీవు దాటుచున్నావా. అలాగయితే నీవు ఇంకనూ లోతుకు వెళ్ళాలి. అప్పుడు మహిమలో నీవు నదిని చూస్తావు. దానికి ఇరుప్రక్కల చేపలు పట్టే వారిని చూడవచ్చును. దానికి ఇరుప్రక్కల సమస్తము జీవములోనికి వచ్చుట చూస్తావు. అది ఎంత సంతోషం కలిగిస్తుంది!. ఎండిపోయినట్లు కనబడేది అంతా దేవుని కృప నీ జీవితంలో ప్రకాశించేటప్పుడు పచ్చగా మారుతుంది. ''జీవము నీలోనికి సమృద్ధిగా ప్రవహించినప్పుడు నీ చుట్టూ ఉన్న వారికి నీ ద్వారా ప్రవహించేటప్పుడు ఇది జరుగుతుంది. దేవుడు ఈ పరిస్థితికి మనలను తీసుకువస్తాడు. ఒడ్డు నుండి నిత్యము పచ్చగా ఉండే చెట్లు ఫలములు ఫలించును. ఆ ఫలములు ఆహారమునకు పనికి వచ్చును. ప్రతి క్రైస్తవుడు ఈ నది ప్రక్కన నాటబడును. ప్రతి క్రైస్తవుడు తన్ను తాను ఇక్కడ నాటు కొనును. వాడు తమ వేళ్ళను నది క్రింద లోతుగా పంపించును. క్రైస్తవ ప్రజలు ఈలాగు నాటబడి అలాగు కదల్చబడుటకు ఇష్టపడని వారు ఎల్లప్పుడు పచ్చగా ఉందురు. యిర్మియా 17:5-8 వరకు ''యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు - నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలే ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలే ఉండును. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగిననూ దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షములేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు'' నీ జీవితములో వర్షము లేని సంవత్సరములను కల్మషముగాను ఉన్నావా? అయితే నీవు మానవుని నమ్ముచున్నావన్నమాట.

ఈ నది పక్కన నీవు నాటబడితే జనములు తినగలిగినటువంటి ఫలములు ఫలిస్తావు. పరి పౌలు యొక్క జీవితములోని ఆత్మ ఫలములు జనములు కూడా ఈ దినమున తింటూ ఉన్నారు. ప్రతి గొప్ప పరిశుద్ధునికి స్వస్థపరుచుటకు శక్తి కలదు. మీలో ప్రతి ఒక్కరు ఒక నాటికి స్వస్థపరుచుదురు. నీవు పవిత్రమైన మనస్సాక్షిని పరిశుద్ధమైన హృదయమును కాపాడుకుంటే ఈలాగు జరుగుతుంది. స్వస్థపరిచే ఆకులు నీలో నుండి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. నీవు ప్రవహించే నది వెంబడి వెళ్ళుతున్నావో లేదో చూసుకో. నది దాటుటకు వీలుకానిది అయితే నీవు బయటకు వెళ్ళి దాని ప్రక్కన నాటబడుదువు. నీవు ఫలించే ఫలములు ఆత్మ ఫలములు. భక్తి హీనుడైన భర్త కూడా ఈ ఫలములను నిర్లక్ష్య పెట్టలేడు. దాని ద్వారా సవాలు చేయబడతాడు.

నీవు మోకాలు లోతు లేక నడుములోతు ఉండవచ్చు. కాని నీవు వెంబడించు. నీవు దాట లేనటువంటి వీలుకాని జీవితమును నీవు సమీపించిప్పుడు నిన్నును, నీ చుట్టూ ఉన్నవారిని నది కప్పివేయును. పరలోకము భూలోకము అక్కడ కలుసుకొనును. క్రీస్తును వెంబడించే వారికి దేవుని కృప సమృద్ధిగా దొరుకును. నీవు ఫలిస్తావు. నీ ఆకులు స్వస్థపరుస్తాయి. దేవుని కృపలోనూ, దేవుని ప్రేమలోనూ నీవు మునిగిపోయిప్పుడు ఈ నదిని వెంబడించు. నీవు వెళ్ళి ప్రార్థించి విశ్వసించు. ఆశీర్వాదముగా ఉండు. నీ బంధు జనులు త్రోసి వేయలేని రీతిగా నీవు ఫలించు. నీ జీవితములో ఓటమి ఉండనీయవద్దు.

మూల ప్రసంగాలు