|
దేవుని ఆత్మ మిమ్మును ఎన్నడైనా కలుసుకున్నాడా ? |
కీ.శే. యన్. దానియేలు గారు |
ప్రకటన 3:11-19
దేవుడు ఒక సంఘముతో మాట్లాడుతున్నాడు. ఈ విలువలు మానవ విలువలకు పోల్చదగినవి కావు. ఇది దేవుని ఆత్మ సంఘములతో చెప్పిన విషయం. ఒక వ్యక్తి దేవుని ఆత్మ వలన మార్పులోనికి వస్తే అతని పాపములను ఒప్పుకొనమని చెప్పనక్కరలేదు. అది తనంతట తానే చేస్తాడు. దేవుని ఆత్మ నిన్ను కలుసుకున్నాడా? అది జరిగినప్పుడు ఒక అద్భుతకరమైన ప్రకటన అనేది కలుగుతుంది. దానిని నీవు దానివలన ప్రయోజనం లేదు. ఆత్మ నిన్ను తాకినప్పుడు నీలో లోతైన విరిగి నలిగిన స్థితి కలుగుతుంది. దీనత్వం కలుగుతుంది. చిన్నప్పటి నుండి నీవు చేసిన పాపములను అన్నిటిని ఒప్పుకుంటావు. నీవు ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా మారతావు.
విశ్వాసమును బట్టి కాక నీ ఉత్సాహమును బట్టి క్రియలు నీ తలంపులు నీ యేర్పాట్లు అన్నీ నీ ఉత్సాహము వలన కలిగిన కార్యములే. ఆత్మకు నీ కార్యములు తెలుసు. దేవుని ఆత్మ నిన్ను కలుసుకున్నప్పుడు నీ సొంత క్రియలు అన్నీ నీవు ఎరుగుదువు. నీవు వేడిగానైననూ చల్లగానైననూ లేవు. నీవు ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు వారివలే ప్రవర్తిస్తావు. నీవు దుష్ట స్నేహితుల మధ్య ఉన్నప్పుడు నీవు దుష్ట సమాచారం మాట్లాడతావు. దేవునికి వ్యతిరేకముగానైనా మాట్లాడతావు. దేవుడు నిన్ను ఉమ్మి వేస్తాడు.
నీవు ధనికుడినని నీవు చెప్పవచ్చు. కాని దేవుడు నిన్ను దౌర్భాగ్యుడవని పిలుస్తున్నాడు. నీవు కలిగి ఉన్నదేదియూ తీర్పు దినమున నీకు సహాయము చేయదు. ఆహాబుకున్న కవచము అతనిని కాపాడలేక పోయింది. దేవుడు ఇలాగు చెప్పుతున్నాడు. నీ యింట దేవునికి ఇష్టమైనదేదియూ లేదని చెప్పుతున్నాడు. దేవుడు నీ యింటిలోనికి ఎన్నడూ అడుగు పెట్టడు. నీవు పేదలలో అతి పేదవాడివి. ఆత్మ నీవు దౌర్భాగ్యుడవు అని ఆత్మీయ దృష్టి లేని వాడివని నీకు ఆత్మీయ తైలము లేదని చెప్పుతున్నాడు. నీవు ఆత్మను ఎన్నడైననూ కలుసుకున్నావా? చెవి గలవాడు ఆత్మ సెలవిచ్చుమాటను వినవలెను! నీ వ్యక్తిగత జీవితమును గూర్చి నీ కుటుంబ జీవితమును గూర్చి ఆత్మ సెలవిచ్చునది ఎప్పుడైనా వింటివా.
నీవు సంపాదించిన దానిలో మేలు ఏమైననూ ఉన్నదా? నీ యింటిలో మరియొక తరం వరకు నిలువబడియుండే నిత్యమైన విలువ గలవి ఏమియూ లేవు. కీర్తనలు 103:17 ''ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలననుసరించి నడుచుకొను వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును'' మీ బిడ్డలకు ఆ నిధి లభించును. మీ బిడ్డల మీద ఉండే సమాధానము దేవుని వాక్యము నందలి వారి విశ్వాసము నందును. క్రీస్తు యేసు మరణము మీదను ఆధారపడియున్నది. నిత్యము నిలిచేది నీ బిడ్డలకు సంపాదించాలి.
నీ సరుకు నిత్యము నిలువదు. లోతు దగ్గర ఉండిన సరుకులన్నీ బూడిద అయిపోయినాయి. బైబిలును తగులబెట్టి దానిని హేళన చేసేవారు. వారి యొక్క సరుకు ధూళిగా మార్చబడుతుంది. నీకు ఒక బలమైన మార్పు ఉన్నది. అది నీ సొంతమైన మారుమనస్సు. నీవు దేవుని ఆత్మను ఎన్నడూ కలుసుకొనలేదు. నీవు దీనుడవును, దరిద్రుడవును, పేదవాడవును, గ్రుడ్డివాడవునైయున్నావు. 1 యోహాను 2:11 తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను. కనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు''. సౌలు, దావీదు యెడల ఉన్న ద్వేషము చేత గ్రుడ్డివాడుగా మార్చబడ్డాడు. కోపము, ద్వేషము ఒకనిని గ్రుడ్డివానిగా చేస్తుంది.
నేను బాగానే యున్నానని నీవు అనుకొనవచ్చు. నీ వస్త్రములు నిన్ను కప్పవు. దేవుడు నిన్ను తన నీతితో కప్పగలడు. దేవుని వాక్యం అగ్నిలో పుటము వేయబడినది. కీర్తనలు 12:6 ''యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి''. దేవుని వాక్యము జ్ఞానము. దేవుని ఆత్మ నీ మీదకు పంపబడియున్నాడు. కాని దేవుని ఆత్మ నిన్ను ఎన్నడైననూ కలుసుకున్నాడా ???
|
|