|
క్రీస్తుతో కూడా నుండుట మంచిదే ! |
కీ.శే. యన్. దానియేలు గారు |
మార్కు 9:2-8 వరకు
''యజమానుడా మనమిక్కడ ఉండుట మంచిది'' క్రీస్తును పరిశుద్ధమైన మహిమలో అంతకు ముందు ఉండిన పరిశుద్దులతో చూసినట్లయితే, ఇదే నిర్ణయం మనలో ప్రతివారము చేస్తాము. మనం చిట్ట చివరగా ఈ నిర్ణయానికి వస్తాము. మనం క్రీస్తుతో కూడా ఉండుట మంచిదని నిర్ణయిస్తాము. పేతురు యేసూ ప్రభువుతో 5వేల మందికి ఆహారం పెట్టినప్పుడు, ఇంకా ఇతర అద్భుతాలు చేసినప్పుడు ఉండినాడు. కానీ ఇక్కడ ఉండుట మంచిది అని అతడు అనలేదు. ప్రార్ధనా స్థలము ఎక్కడైతే పరలోకము భూలోకము కలుసుకున్నాయో పేతురు ఆ స్థలమును చూపినప్పుడు అక్కడే ఉండవలెనని ఆశ కల్గినది. నూతన ఆకాశము నూతన భూమి వీటియందు దేవుని మహిమను చూసాడు. అతడా సంతోషమును కాపాడుకోవాలి అనుకొన్నాడు. అతడు మూడు పర్ణశాలలు కట్టాలని మట్టుకు నిర్ణయించుకున్నాడు. మనము పరలోకమును చూస్తే ఈ లోకములో ఉండవలెనని ఆశించము.
పేతురు యేసుతో తుఫానులో ఉండినాడు, నీళ్ళమీద ఉండినాడు. కానీ సిలువ సమయములో ఆయన ప్రక్కన ఉండలేక పోయాడు. నిన్ను ఎరుగనని బొంకాడు. క్రీస్తు రూపాంతరము పొందిన కొండ మీద పేతురు ఆయనతో ఉండినాడు. దేవుడు మనకు పరలోక దర్శనం ఇవ్వగలడు. కానీ ఇప్పుడు క్రీస్తుతో శ్రమ పడటం మేలు. క్రీస్తుతో సిలువ వేయపడుటకు మనలో ఎంతమందిమి సిద్ధముగా ఉన్నాము. క్రీస్తు సిలువవేయబడిన దినమున ఆయనతో ఉండాలని ఆశించాడు కానీ దానికి తగిన విశ్వాసము లేదు. పేతురు ఒక చిన్నది వేసిన ప్రశ్నలకు భయపడి పోయాడు. ఎందుకంటే అతడు ప్రార్ధన చేసిన వాడు కాదు. క్రీస్తు రూపాంతరము పొందిన కొండ మీద ఉండటం మంచిది. కానీ క్రీస్తు సిలువవేయబడిన కొండ మీద ఉండుట అతి శ్రేష్టమైన విషయం. అప్పుడు నీవు క్రీస్తులో నిత్యము ఉంటావు. మహిమను కోరువద్దు కానీ మేకులను, సిలువను కోరు. ప్రార్ధన చేసే కొండ మీదికి ఎక్కినవారు క్రీస్తును సిలువ వేయబడిన కొండ మీదికి కూడా ఎక్కుతారు. ఆయనతో పాటు పరలోకం కూడా వెళతారు. దేవుని పిల్లలకు ఎల్లప్పుడు అతిశ్రేష్టమైనవి ఇవ్వబడతాయి.
|
|