|
నీ పిలుపును, ఎన్నికను నిశ్చయం చేసుకో |
కీ.శే. యన్. దానియేలు గారు |
2 పేతురు 1:10
''అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టిక్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు''.
పేతురు తన కాలమందున్న సంఘమునకు వారి పిలుపును ఏర్పాటును నిశ్చయంచేసుకొమ్మని చెప్పుతున్నాడు. భక్తిలో నిశ్చయత అనేది గొప్ప లాభము. నిశ్చయత లేని, నిజములేని, ఊగిసలాడే విశ్వాసము ఏ సహాయము చేయలేదు. పరిశుద్ధాత్ముడు మనకు లోతైన నిశ్చయత ఇస్తాడు. పవిత్ర హృదయము ఉంటే పవిత్ర ఆత్మకూడా ఉంటుంది. అప్పుడు మన ఆత్మకును, దేవుని ఆత్మకును మధ్య ఏకత్వం ఉంటుంది. హృదయము శుద్ధీకరించబడినప్పుడు మన విశ్వాసములో నిశ్చయత ఉంటుంది. ఆ నిశ్చయతను అప్పుడప్పుడూ పరీక్షించుకోవాలి. నీవు కృపనుండి క్రిందికు పడి పోయావేమో చూసుకోవాలి. అలాగు కానప్పుడు కృపాసహితమైన క్రీస్తును పోలినటువంటి మాదిరి నీలో కనబడుతుంది.
నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు నీ దృష్టి తేటగా ఉంటుంది. నీ విశ్వాసమునకు సద్గుణము చేర్చుకో. నీ విశ్వాసము నిజముగా విశ్వాసము అయితే దానికి సద్గుణము చేర్చబడుతుంది. నీవు నీ సద్గుణమునకు తెలివి తేటలు కలుపుకోవాలి. తెలివి ఎప్పుడూ ఒక గొప్ప శక్తి. నీ సద్గుణమును దేవుని వాక్యమందు నీకుండే తెలివితో బలపర్చాలి. పరిమితత్వమునకు అవసరమైన సద్గుణము, మన విశ్వాసము మనలను పరిమితత్వములోనికి నడిపించాలి. ప్రతిదానిలో పరిమితత్వము - భుజించుటలోనూ, త్రాగుటలోనూ నిద్రించుటలోనూ, మరియు మాట్లాడుటలోనూ అవసరము ఉన్నది. మన స్నేహితులకు, మన బంధువులకు మనము చూపే ప్రేమ దేవుని చేతనడిపించబడిన పరిమితత్వముగా ఉండాలి. నీవీ విషయములను వెంబడిస్తే నీకు ఇవ్వబడే దేవుని కృప పరిమితిగలది కాదు. ఓర్పుకొరకు మనము దేవునిని అడగాలి. నిశ్చబ్దముగా ఉండి ఎక్కువగా మాట్లాడనివాడు బహుకొద్ది తప్పులు చేస్తారు. ఓర్పుకు దైవ భక్తి కలపాలి. త్వరగాలేచి దేవునితో సమయము సమయము గడపడానికీ, దేవుని స్తుతించడానికీ, పాటలు పాడడానికీ ఉపవాసముండి ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోవడం ఇవన్నీ దైవభక్తి సూచనలు. దైవభక్తికి సహోదర ప్రేమను కలపాలి. అనేకసార్లు మనము దయగా ఉంటాము కానీ అది ప్రేమ హీనమైనది. ప్రేమ నీలో నుండి దైవ స్వభావమును తెచ్చును. ఇవి నీలో పెరిగినట్లయితే నీవు సేవలో ఫలింపని వానిగా ఉండవు. మనలను మనము పవిత్రముగా కాపాడుకొని ఈ గుణాంకములన్నింటినీ తెచ్చుకోవడానికి ప్రయత్నము చేసినట్లయితే మనమెన్నడునూ తప్పిపోము. మారుమనస్సు పొందిన తర్వాత చేయవలసినది ఎంతో ఉన్నది. మనకు ఒకే గురి. ఏమంటే దేవుని పరిపూర్ణ చిత్తమును సంపాదించుకోవాలి. సామె 4:23 నీ ''హృదయములో నుండి జీవధారలు బయలు దేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొమ్ము''.
పేతురుకు క్రీస్తునందలి నిజత్వమును చూచు భాగ్యము దొరికింది. ఆయన వేకువచుక్కను గూర్చి మాట్లాడుతాడు. మీ మార్గ మార్గ మందు తేటమైన వెలుగు ప్రకాశించును. మీ ఎన్నికను, మీ పిలుపును అంతకంతకూ తేటగా మారును. వీటిని జాగ్రత్తగా కాపాడుకొనుటకు పాటుపడుము.
|
|