|
మీరు పరలోకము తెరవబడుట చూస్తారు |
కీ.శే. యన్. దానియేలు గారు |
యోహాను 1:51 ''మరియు ఆయన - మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును, దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.''
నతానియేలను నామము కల్గిన యొకడు క్రీస్తు దగ్గరకు తేబడ్డాడు. పిలిప్పు క్రీస్తు దగ్గరకు అతనిని తీసుకువచ్చాడు. నతానియేలు నజరేతులోనుండి మంచిది ఏదీ రాలేదని నమ్మాడు. కానీ అతడు ఇశ్రాయేలులో కపటము లేని వాడని క్రీస్తు అతని గూర్చి వివరించినప్పడు క్రీస్తు నందు విశ్వసించాడు. ఫిలిప్పు అతనిని పిలవకముందే క్రీస్తు అతనిని ఎరిగి ఉన్నాడు. నతానియేలును గూర్చి ఫిలిప్ప కన్నా క్రీస్తే ఎక్కువగా ఎరుగును. కపటము లేకుండా ఉండడం అంటే, అది దేవుని ఎదుట గొప్ప గుణ లక్షణము. దేవుడు నిన్ను పరిపూర్ణముగా ఎరుగును. ఆయన నీ గూర్చి ఇతరుల కన్నా ఎక్కువగా తెలుసుకొనియున్న దేవుడు. నీ తల్లిదండ్రులకన్నా లేక భర్తకన్నా లేక భార్యకన్నా ఎక్కువగా ఎరుగును. నీ సద్గుణము గురించి ఆయన చూపించగల్గును, నీ బలహీనత గురించి ఆయన చూపించగలుగును. ఆయన ఎంత అద్భుతకరుడంటే నీయందు ఉన్నటువంటి మంచిని ఆయన వినియోగించుకొని ఆ మంచిని తన మహిమార్థమై వాడుకొనును. యోహాను 6:44 ''నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకురాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును.'' ఆయన మనుష్యులు అందరిలో క్రియ చేస్తున్నాడు. యోహాను 6:45. ''వారందరును దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును.'' ప్రతివారు దేవుని వలన నేర్పించబడుతున్నారు. కొందరు ఆయనకు విధేయులు అవుతారు. మరికొందరు విధేయులు కారు. నీవు ఆయనకు విధేయుడవు అయినంత వరకు దేవుని కృప నీకివ్వబడుతుంది. నీవు చాలా లోతైన విషయాలు ఎరుగకపోవచ్చును. కానీ నీవు ఎరిగిన కొద్ది సత్యమునకు విధేయుడవు అయితే ఉన్నతమైన కృప నీకు ఇవ్వబడుతుంది. క్రీస్తు సమక్షములోనికి నతానియేలు తీసుకొని రాబడడం ఆశ్చర్యకరమైనది. ఒక విధముగా అతడు దేవుని సన్నిధిలో అంతకు ముందునుంచే ఉన్నాడు. కానీ ఇప్పుడు క్రీస్తు తన సొంతసేవలో అతనిని వినియోగించుకోబోతున్నాడు. ఇది నతాని యేలుకు గొప్ప దినము. భూలోకం యొక్క న్యాయాధిపతి యెదుట అతడు నిలబడబోతున్నాడు. దేవాదిదేవుని యెదుట నిలువబడటం ఎంత మేలుకరమైనది! ఆయన నీ గూర్చి తీర్చే తీర్పును వినడం మరెంత మేలుకరమైనది. నీవు ఎవరో తెలుసుకొనుటలో నీవు ఇకనూ పొరపాటు చేయవు కానీ నతాని యేలు అన్నిటినీ ఎరుగడు. దైవ వాక్యములో క్రీస్తును గూర్చి మాట్లాడినారని నతాని యేలు ఎరుగును. క్రీస్తు ను చూసినప్పుడు అతడు చాలా సంతోషించాడు. ''నీవు దేవుని కుమారుడవు. ఇశ్రాయేలుకు రాజువు'' అని అతడు చెప్పాడు. దానికి ఆయన ''నీవు పరలోకము తెరువబడుటయే దేవుని కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు చూస్తావు.'' నీవు ఇంకనూ గొప్పవాటిని చూడవలసి ఉన్నావని క్రీస్తు చెప్పెను. కానీ దేవుడు ఇంకా గొప్పవాటిని చూపించవలెనని కోరుతున్నాడు. మారు మనస్సు పొందినప్పుడు నీవు దేవునిని కొంతవరకు చూసావు. అనేక మంది ఆ అనుభవముతో నిలిచిపోతారు. దేవుడైతే పరలోకము తెరువబడి యుండుట నీకు చూపించగోరుతున్నాడు. అనేకమైన సత్యములు నీకు తెలియపర్చబడతాయి. నీవు చూసే ప్రతిది నిన్ను ఉత్తేజపరుస్తుంది. నిన్నుచూచువారు ఉత్తేజపర్చబడతారు. క్రొత్త వెలుగు. క్రొత్తశక్తి నీయందు అగుపడును. ఆయనను నీవు రక్షకునిగామట్టుకు ఎరుగవు కానీ ప్రభువు గానూ, రాజుగానూ ఎరుగుదువు.
|
|